అమలులోకి వచ్చిన కొత్త న్యాయస్మృతి

India: A view of the Supreme Court of India (SCI) building

New Legal Code Implemented in India: Modernizing Two Centuries-Old Laws Credit: Sipa USA/AAPImage

Get the SBS Audio app

Other ways to listen

రెండు శతాబ్ధాల క్రితం నాటి భారతీయ శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లింది. వాటి స్థానే జూలై 1వ తారీఖు నుంచి భారతీయ ప్రభుత్వం కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చింది.


బ్రిటీష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి, భారత సాక్ష్యాధార చట్టాల స్థానే, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బిఎస్ఎ) లు అమల్లోకి వచ్చాయి.

నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా పాతబడిన శిక్షాస్మృతిలో సంస్కరణలు తేవడం ద్వారా ‘ఇక వలసపాలన నాటి న్యాయ చట్టాలు శాశ్వతంగా కనుమరుగయ్యాయని, ‘శిక్ష’కి కాకుండా ‘న్యాయానికి’ ప్రాధాన్యత నిచ్చి, భారతీయుల కోసం భారతీయులు రూపొందించుకున్న చట్టాలుగా’ ఈ కొత్త న్యాయస్మృతిని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా అభివర్ణించారు.

అయితే ‘ఈ చట్టాలను ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రభుత్వం అమలలోకి తీసుకు వచ్చిందని, పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో చర్చలు జరపకుండానే ప్రభుత్వం కొత్త చట్టాలను ఆదరా, బాదరా అమలు చేయటం ద్వారా తొందరపాటుతనాన్ని ప్రదర్శించిందని కాంగ్రెసు నాయకుడు, మాజీ న్యాయమంత్రి అశ్విన్ కుమార్ అన్నారు. అందుకు స్పందిస్తూ, కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్ష నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు

. భారతీయ న్యాయ సంహిత తదితర చట్టాలపై లోక్ సభలో తొమ్మిదిన్నర గంటలు, రాజ్యసభలో ఆరు గంటల పాటు చర్చించామని తెలిపారు. కొత్త చట్టాలపై మరింత చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, కొత్త న్యాయ చట్టాలపై అభిప్రాయాలు పంచుకోవాలని ఎంపీలకు లేఖ రాశానని కూడా అమిత్ షా వెల్లడించారు.

మారిన సామాజిక విలువలకనుగుణంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియో గించుకునే విధంగా చట్టాలను భారతీయ న్యాయ సంహితలో సులభతరం చేశారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలో భాగంగా న్యాయవిధానాలను సరళతరం చేయటంతోపాటు, త్వరితగతిన న్యాయాన్ని అందించడానికి చట్టంలో సవరణలు చేశారు. ఇక చివరగా, భారతీయ సాక్ష్య అధినియమ్ ద్వారా పెరిగిన సాంకేతిక విజ్ఞానం, పరికరాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని డిజిటల్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో విడుదల చేసే సమాచారాన్ని సాక్ష్యాలుగా అంగీకరిస్తారు. ముఖ్యంగా, కొన్ని నేరాలకు శిక్షగా సామాజిక సేవను ప్రవేశపెట్టనున్నారు. జీరో ఎఫ్ఐఆర్, ఆన్ లైన్లో ఫిర్యాదు నమోదు చేయగలగటం, ఎస్సెమ్మెస్ల ద్వారా సమన్లు జారీ చేసే పద్ధతులు ఈ కొత్త ఈ న్యాయ వ్యవస్థ ద్వారా వీలవుతాయి.

ఈ సంస్కరణలు న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, జవాబుదారీతనాన్ని తీసుకువస్తుందని ప్రభుత్వం చెపుతున్నప్పటికీ, పలువర్గాల నుంచి భిన్న అభిప్రాయాలు, అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా కొందరు న్యాయవాదులు ఈ నూతన చట్టాలను ఆహ్వానిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

‘75 సంవత్సరాలుగా ఈ వలసవాద చట్టాలు మన న్యాయవ్యవస్థకు గుదిబండలుగా మారాయని, భారతీయతత్తత్వంతో కొత్తచట్టాలు ఊపిరిపోసుకున్నాయని ’ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ ఆదిష్. సి. అగర్వాల్ అన్నారు. జాతి, కుల, మత వివక్షతకు, లింగ, భాష, ప్రాంతాలనుగుణంగా చూపే వివక్షలకు సంబంధించిన నేరాలకు పాత చట్టాలలో శిక్షలు విధించటం కష్టంగా ఉండేదని, మారిన కొత్త చట్టాలు అందుకు వెసలుబాటును కల్గిస్తాయని ఆయన చెప్పారు.


ఈ కొత్త చట్టాలలోని కొన్ని ముఖ్యాంశాలు....

• బిఎన్ఎస్ లో భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న 511 సెక్షన్లను 358గా కుదించారు. వీటితోపాటుగా ద్వేషపూరిత నేరాలు, మూకోన్మాదం వంటి మరో 21 నేరాలను చేర్చారు. దేశ భద్రత, సార్వభౌమత్వానికి నష్టం వాటిల్లేటట్టుగా చేసే ఉపన్యాసాలను, ఉగ్రవాద చర్యలను, వ్యవస్థీకృత నేరాలను కొత్త చట్టాలలో నేరాలుగా పరిగణిస్తూ, స్ఫష్టంగా నిర్వచించారు. అదేసమయంలో ‘రాజద్రోహం’ అనే పదాన్ని చట్టాల నుంచి తొలగించారు.

• మొట్టమొదటిసారిగా మరణశిక్షను చట్టబద్ధం చేస్తూ, మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తే, మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష వేసే అవకాన్ని ఈ కొత్త చట్టాలలో కల్పించారు. చిన్నారులపై సామూహిక అత్యాచారాలు, మూకదాడులు, పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం వంటి వాటి నేరాలకు ఇదివరకటి శిక్షాస్మృతిలో ప్రత్యేక సెక్షన్లు లేవు. ఆ లోటును భారతీయ న్యాయ సంహితలో పూడుస్తూ, యాసిడ్ దాడులు, లైంగిక సంబంధ హింస, ఎవరైనాన వెంబడించి భయాందోళనకు గురిచేయటం వంటి నేరాలను భారతీయ న్యాయసంహితలో చేర్చారు.

• మారుతున్న సాంకేతిక యుగాన్ని అనుసరించి, సైబర్ నేరాలకు సంబంధించిన అనేక విషయాలను ఈ చట్టాలలో చేర్చారు. ఆనలైన్ లో ఏడిపించడం, వ్యక్తుల గుర్తింపులను చోరీచేయటం (identity theft), హ్యాకింగ్ లకు సంబంధించి ప్రత్యేక సెక్షన్లను చేర్చారు. అదేవిధంగా, ఆర్థిక నేరాలకు సంబంధించి, పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్లే విధంగా, అక్రమ గనుల తవ్వకాలు, పర్యావరణ కాలుష్యం, చెట్లను కొట్టివేయటం వంటి అంశాలను కూడా నేరాలుగా కొత్త చట్టలు పరిగణిస్తాయి.

• బాధితులను దృష్టిలో పెట్టుకుని, జీరో ఎఫ్ఐఆర్, ఈ-ఎఫ్ఐఆర్లను ప్రవేశపెట్టారు. జీరో ఎఫ్ఐఆర్ ద్వారా నేరం జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాక ఎక్కడైనా నేరాన్ని నమోదు చేయవచ్చు. అలాగే ఆన్ లైన్ లో ఎఫ్ఐఆర్ ను నమోదు చేయటం ద్వారా పారదర్శకతను పెంచి, అవినీతిని నిరోధించే వీలు కలగటంతోపాటు, కేసుకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇక ఎస్ఎమ్మెస్ ద్వారా సమన్లు కూడా పంపవచ్చు.

• న్యాయంలో జాప్యం జరగకుండా నేరవిచారణలో వేగం పెంచేందుకు అనువైన సవరణలను భారతీయ నాగరిక సురక్షా సంహితలో పొందుపర్చారు. ఈ చట్టం ప్రకారం, తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. అలాగే క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజులలోపు ఖశ్చితంగా తీర్పు వెలువడాలి. ఇక నేరస్తుడు కోర్టుకు హాజరుకాకపోయినా విచారణ జరపవచ్చు.

• ముఖ్యంగా, భారతీయ సాక్ష్యా అధినియమ్ లో భాగంగా ఫోరెన్సిక్ సాక్ష్యాల ప్రామాణాలు పెంచే దిశగా జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

• పిచ్చివాడు, అవివేకి, ఇడియట్, బ్రిటీష్ కాల్యండర్, క్వీన్, బ్రిటీష్ ఇండియా, శాంతి కోసం న్యాయం వంటి పదాలను తొలగించారు.

• ఇక లింగ విభజనలో ట్రన్స్ జెండర్ల వర్గం చేర్చారు.

• ఆత్మహత్యా యత్నాన్ని నేర జాబితా నుంచి తొలగించారు.

• మొట్టమొదటసారిగా చేతికి బేడీలు వేసే సాంప్రదాయం మొదలు. ఘోరమైన నేరాల్లో నేరస్తుల చేతులకి బేడీలు వేసే నిబంధన చేర్చారు.

• కొన్ని నేరాలకు కమ్యూనిటీ సర్వీసును శిక్షగా అమలు చేస్తారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share